Friday, April 11, 2008

మా వాడివై (కొడుకుపై తండ్రి కవిత)

ధీరుడవై శూరుడవై, జగమున నిలిచే పౌరడవై
బంధువుడవై, ఆదరుడివై, తండ్రిని మించిన తనయుడవై
అమ్మకు నీడవై, తమ్ముని తోడువై
చిన్నారి చెల్లిని అలరించే మిత్రుడవై
కష్టాలకి శత్రుడవై, సుఖాల సంపన్నుడవై
మేమెచ్చిన కోడలికి, నడిపించే నాధుడవై
మట్టిలో మెరిసిన ముత్యమై, మేమూహించిన సత్యమై
దీన బంధుల నీడవై, మా పున్నమి నాటి వెన్నెలై
మేకోరిన చేరువై, మా తీరిన కోరికై
అండగా నిలిచిన వాడవై, మమ్ముగా ప్రేమించిన మా వాడివై.
నిన్ను చూసి (ప్రేమ కవిత)

నిన్నుచూసి నా రాధవని అనుకున్నా
మురళిలేని వేణు గానమనుకున్నా
ఎదురుగ నిలిచున్నా, నీ మనసుని తాకుతున్నా
నా కళ్ళలోని వేదనని కనలేవా
ప్రతీ క్షణం నాగుండె చప్పుడు వినలేవా
ఈ బంధం ఏనాటిదో సంబంధం కుదిరేనో లేదో

నీ కనులలోని వెలుగునాకు తెలిసింది
నీ పెదవిమీది కొంటె నవ్వు తెలిపింది
ఎదురుగ నిలిచున్నా, నీ మనసుని తాకుతున్నా
ఎన్నాళ్ళని వేచేది
ఆ రోజొస్తుందని చూసేది
కారణాలు లేవని నువ్వంటున్నా
తోరణాలు పేర్చి నే కడుతున్నా
ఒంటరిగా (ప్రేమ కవిత)

ఊహల్లోచేరి నన్నువూరించకే
కళ్ళల్లో కదలాడి మనసు కదిలించకే
ఒంటరిగా ఉన్నాను, జంట కోరుతున్నాను
నాకెదురు పడక నన్ను విసిగించకే

నాతో వస్తావని నేకోరుకున్నాను
నాతోవుంటావని నేనాశపడ్డాను
ఒంటరిగా ఉన్నాను, జంట కోరుతున్నాను
నీ అడుగులో అడుగునై నేసాగుతున్నాను

మన కోసం ఈపాట రాసుకున్నాను
నీతో పాడాలని నేవేచియున్నాను
ఒంటరిగా ఉన్నాను, జంట కోరుతున్నాను
మనయిద్దరి సంగీతం నేపాడుకుంటాను
ఎదురు (ప్రేమ కవిత)

ఎదురు చూశాను నీ రాకకోసం
ఎన్ని ఘడియాలనే నాగుండె నీ శ్వాశకోసం
నీచేతితో తను మాట్లాడాలని
నాచెయ్యి అడిగే నిన్ను పిలువమని
నీవూహలో తను చేరాలని
నా మనసు తలిచే నువు కోరాలని
నీ స్నేహమే నా వూపిరవ్వాలని
నీచెంత నేచేరుకోవాలని
తపియించి నా హృదయం నిను వెతుకుతూవుంది
విరహాన నా తనువు నిను కోరుతూవుంది
బ్రోచేవారేవరురాయనే త్యాగరాజు
కరుణించి ననునీవు చేరదీయ రాదూ!
ఎప్పుడు? (హాస్య ప్రేమ కవిత)

ఉదయం భానుడికై వేచినట్టు
సంధ్యా చంద్రునికోసం చూసినట్టు
కన్నకలలే పండుతూ ఉన్నట్టు
తీయని పండు రాలుతున్నట్టు
పదాలు కుదిరినట్టు, పెదాలు తగిలినట్టు
కరంటు పాకినట్టు, నీ వంటి చీరకట్టు
జిలేబి తిన్నట్టు, జల స్నానం చేసినట్టు
నా తలపే తలపెట్టు, జాచిన నా చెయ్యిపట్టు.
దేవీ గీతం (కవిత)

నినుకోరి నీ బంటునై నిను చేరాలని
నీసేవలో నా జీవితం సాగాలని
కోరింది నేనే, కరుణనేది నీదే
మనిషినైనందుకు కోరికలు కలిగే
దేవతవై యీభక్తుని నుచేర దీయు వరకే
ఊహ (ప్రేమ కవిత)

నువ్వేసే ప్రతి అడుగు, నా మనసునియడుగు
నీ వెంట రావాలని, నీ చెంత చేరాలని
నీ చెయ్యి తగిలింది, చలనం నాలో రగిలింది
నువ్వే కావాలని, నిన్నే కలవాలని
గణ గణ అనే యాశబ్ధం, గుడిలోని గంటకాదు
చేవితోన కాదు నీ మనసు విప్పి విని చూడు
నా శ్వాశలో నీ పేరు, నావూపిరిలో నువుచేరు
నీ తలపే నా గమ్యం, నూ కరుణిస్తే బహురమ్యం
నీ యాలోచన తుంపరై, నా కోరిక కిరణమై
మన కలయిక హరివిల్లు, స్వగ్రుహాన శోభిల్లు
వింత గానం (ప్రేమ కవిత)

గాలికి పడిలేచే నీ కురులనై తాకనా
నీ నవ్వుతో కదలాడే పెదవులనై సాగనా
నీ మెడలోని గోలుసునై, నడుం మీది సొగాసునై
నువు వేసే ప్రతి అడుగులో మువ్వనై మోగనా?
నోటి మాట రానప్పుడు, కవిత ఎలాపొంగెనో
గొంతు విప్పి పాడనపుడు, గానమెలా పలికేనో
మబ్బులేని వానలా, వేసవిన నీడలా
నీ తలపే నా కల మై , యీపదాలు పాడెగా

పొడుగాటి పెళ్ళాం (హాస్య కవిత)

చెట్టుయెక్కి పెట్టు ముద్దు, ఇంటి కప్పు తాను సర్దు
మోకాలి కింది చీరకట్టు, తాను వంగినా నాకన్నా పొడవు, కదూ?
అటక మీది వస్తువైన, తాటి చెట్టు కల్లుయైనా
నింగిలోని తారకైనా, తనతోటి కబురులేనా?
సరిపోని మంచమేనా, చెయ్యి పట్టని కంచమేనా
తల తగిలే ద్వారమేనా, జాణా బెత్తెడు మొగుడు నేనా?

వడియాలు (హాస్య కవిత)

నూనెలో సెగ సెగ, తింటే కర కర
పప్పుతో తినడం మానద్దు
సాంబారులో వాటిని ముంచొద్దు
వట్టివైనా సరే ...
ఆ నూనె నా చొక్కాకి మాత్రం పూయొద్దు.
లావటి పెళ్ళాం (హాస్య కవిత)

కొట్టులోని చీర, బండి మీది మక్కబుట్ట
చారులోని పోపు, తక్కువేలే ఎటు చూడు
నడుంపట్టని నగ, ఉడుంపట్టు దీనిసేగా
తప్పించు కునేదేలా, అంతు తెగని యీవల
ఎన్నో గడ్డం పట్టుకోను, ఎమెడైతే సరిపోను
చెయ్యా, చెయ్యి కాక తొడా? ఈ దెబ్బతో విరిగింది నా మెడ

ఆనందం (ప్రేమ కవిత)

అంతులేని ఆనందం, అద్భుతమైన వసంతం
వేణు లేని మధు గానం, నీ మాటే సంగీతం
అల్లుకునే తీగలా, పొంగుతున్న వాగులా
జారుతున్న పైటలా, నీయాలోచన రమ్యమా

కులుకుతున్న హంసలా, చిలుకుతున్న వెన్నలా
ఎగిరే పతంగులా, నీ కులుకే భంగులా
గాయానికి మందులా, పాదానికి పారాణిలా
వంటి మీది నగలులా, నీ చేతులు తగిలెగా
అంతులేని ఆనందం, అద్భుతమైన వసంతం
వేణు లేని మధు గానం, నీ మాటే సంగీతం

ఎవరివై (ప్రేమ కవిత)

తల్లివై, చెల్లివై, చిన్నారి పిల్లవై
జాజివై, సిరిమల్లెవై, నా తోటలో గులాబివై
చందమై, గంధమై, అద్దం లోని అందమై
విందువై, పసందువై, కావలసిన బంధువై
మండుటెండలో చిరు వానవై, చలి మంటలోని తునకవై
రాచ బాటనడు రాణివై, ఎడబాటు లేని నా దానవై.
నివేదన (ప్రేమ కవిత)

నీ వేదన నా వేదన, నా వేదన నివేదన
నీ వేదన నాదేనా, నీవేనా నా వేదన?
నీవే నా దానవే, నీవే నా నాదమే
నా మదినే వినెదవ, నా మది నీవేననవా?
నువ్వు నేను ( ప్రేమ కవిత)

నువ్వు నాకు కనిపించింది, నిన్ను నువ్వు మరవడానికా
నన్ను నేను చూఢఢానికా, మనయిద్దరం కలవడానికా?
నువ్వు నాకు వినిపించింది, నిన్ను నువ్వు తెలపడానికా
నన్ను నేను మార్చడానికా, మనయిద్దరం పాడడానికా?
నువ్వు నన్ను కదిలించింది, నేను నిన్ను తాకడానికా
నువ్వు నన్ను చుట్టడానికా, మనయిద్దరి ముద్దులాటకా?

Thursday, April 10, 2008

కన్నా (తల్లి పాట)

వెంట నడిచే నా నీడ కన్నా
వీచే చల్లటి చిరు గాలి కన్నా
పూజా పుష్పాల సువాసన కన్నా
నా సన్నిహితుడివిరా చిన్నారి కన్నా