Friday, June 13, 2008

పిల్లాట

నల్లది వద్దుట, గోడ మీదది ఎటుట
చిట్టెలుకల మధ్యన, గంటెవరు పెట్టుట

చంకలోనే వుందట, ఊరంతా వెతుకుట
అడిగినా బిచ్చం లేదట, ఊరికే పీనాసట

తన కన్నులు మూతట, పాలు తాగేదెవరు చూడరట
నీ పక్కన చేరిందట, మ్యావు మ్యావుల మూట
గ్రాడ్యువేషన్ పార్టి

పాపగా వచ్చాను, బాలుడిగా పెరిగాను
మనిషిగా మారి నే ఇల్లు దాటి వెళ్తాను

అమ్మ నన్ను పెంచింది, నాన్న ప్రేమ తెలిసింది
అన్న హితవుల సందేశం, వెంట తోడు వచ్చింది

బయట చలి కరిచింది, వంటినంత కొరికింది
ఇంటిలోన దొరికిన, వెచ్చదనం తెలిపింది

నా కంటూ ఒక ఇల్లు సమ కూర్చాలనుంది
అందులోని ఆనందం తెలుసుకోవాలనుంది

Wednesday, June 11, 2008

సమయం

కొన్ని క్షణాలు వింత కావా
మొండితనము పట్టు కాదా
త్యాగబలం స్వార్థమవదా
స్వార్థమే నీ ప్రేమకాదా

కొన్ని పనులు చింత కావా
యుద్ధములో అతడి చావా
బలముకలదనంత చావ
పెద్దలైతె మీదే త్రోవా?

పండు తీరు నీవు కాదా
ముందు కోస్తె చేదు రాదా
ఆలస్యము ఒక కుళ్ళు బాధ
సమయమైతె తీపి కలదా.

Tuesday, June 10, 2008

ఆరు దాటి...

ఆరు దాటి పొద్దున గంటయ్యింది
కాలేజికి బస్సు పట్టె వేళయ్యింది
అమ్మది వంటయ్యింది
ఫీసుకి టైం అయ్యింది

సినిమాకి డబ్బులడగాలని వుంది
ఒక్కరికి కాదులే ఇద్దరికంది
ఆపై ఐస్ క్రీమ్ అంది
బీచిలో సన్ స్క్రీన్ అంది

ఆరు దాటి...

టీచరమ్మ లెక్చరు ఇవ్వాలంది
వినకపోతే బెంచి మీద ఎక్కమంటుంది
క్లాసులు ఎగ్గొట్టి
గుంపును చేబట్టి
గోడ దూకి మ్యాటినీకి వేళ్ళాలనుంది

ఆరు దాటి...

ముందు చూస్తే ఎగ్జామ్సు మోగేట్టుంది
ఇంతవరకు చదవలేక వాచేట్టుంది
అయినా ఇల్లోకటుంది
అమ్మది ప్రేమొకటుంది

ఆరు దాటి...

Monday, June 9, 2008

పాయసమిస్తా...


సన్న తీగల సేమియ వేసి, పాలలోన నానేసి
కోరినంత చక్కర పోసి, చేసివుంచారా కాశి

కోపమెందుకు నన్ను చూసి, బాధ పెట్టకు తలుపులు మూసి
నిద్దరంతా నువు కాజేసి, తోచనట్టు తల గోకేసి
రారా ఇంటికి పాయసమిస్తా, దగ్గరుండి తినిపిస్తా
నీకు సందేహం ఎందుకు, చెంతచేరిన ఈ పిల్లే పిస్తా

సన్న తీగల సేమియా వేసి...

ఆకలేస్తే నేను లేనా, కొరికి చూస్తే కాజా కానా
ఒక్కసారి చేరువైతే, దాటలేని బంధికాన
తెలుసు నాకు నీ సంగతి, పిల్ల తోడు కోరిన కుంపటి
చెంత చేరి చూడర ఇప్పటి, ఆటలాడిన కప్పిన దుప్పటి

సన్న తీగల సేమియా వేసి...

చింత వలదు

నువ్వు గుర్రం కాలేదని, చింత వలదే కంచర
నీది తోకే పెద్దది అయితె, ఎగరగలవు కళ్యాణిలా
మూతి ముడవకె, పెద్దగ నవ్వవే,
నడుము పెంచవె, జుట్టు దించవె

నీకు హంగులు లేవేమోనని, బాధ చెందకె కంచర
నీది సకిలింపేగనకైతే, కీచు గొంతులు మానవా
వంగ మాకె, పొడుగుగా నిలవవె
నడవ మాకె, పరుగులు తీయవె

నువ్వు గుర్రం కాలేదని...
సాంబారా

నా ముందు ఆత్రంగా నన్నారగించమని అడగాలా
మూతకింద దాగియున్న మరిగించిన సాంబారా
తలుపుతీసి ఇంట్లోకి మేమేమన్నా రావాలా
రోడ్డుమీద వెళ్తుంటే ఘుమఘుమలు చాల!
దోబూచులాట...
(కృష్ణార్జున సినిమాలోని త్రువటబాబా పాట రాగంలో...)

దోబూచులాట ఆడకే దేవి
వచ్చాను నీవెంట నిను కోరి
పక్కకు తోసి, మనసుని దోచి
ఇబ్బంది పెట్టకె చకోరి

కళ్ళతో వెంటనే కట్టేసి
చూపులతో గట్టిగ చుట్టేసి
నవ్వుల పరుపును పరిచేసి
ఊహలతో నన్ను వాటేసి

దోబూచులాట...

కొంగుతో నీతో ముడివేసి
మనసులు రెండు జత చేసి
చేతిలో చెయ్యి మెల్లిగా వేసి
తోడు రావే నడిచేసి

దోబూచులాట...