Friday, November 14, 2008

తిరిగి చూస్తావని

పిలిస్తే
అర్ధిస్తే
బొమ్మ గీస్తానంటే
కవిత చెప్తానంటే
పాడతానంటే
నవ్విస్తానంటే

పోనీ ఒట్టి నిజం?
పైన చెప్పింది అదే...

కల

నిజమనుకోనా
ఎదురు చూడనా
మనసు విప్పనా
నిదుర లేవనా
అంత దూరానా
చెంత చేరనా
ఒట్టి ఊహనా
చేత కాదనా


చెప్పలేం...

Friday, October 17, 2008

"కప్ప"టి సాయంత్రం

ఆకాశంలోని మెరుపులు
నా కళ్ళల్లోని కోరికలాగ
ముసురుకున్న మబ్బులు
పరిచిన పేకల్లాగా
అరుస్తున్న ఉరుములు
నా గుండెల్లో ఘోషణలాగా
కురుస్తున్న వానలు
గ్లాసులోని మందులాగా
చుట్ట

చెట్టు మీది ఆకువై
చుట్టుకున్న దానివై
అంటుకుని నిప్పువై
నోటిలోన చేరువై

గుప్పు గుప్పు రైలువై
బహుశా ఊపిరాడని దగ్గువై
మసి రాల్చిన బూడిదై
నా గుండె మాత్రం కాల్చకోయి

Wednesday, October 8, 2008

నన్ను ఎన్నుకో

డబ్బు లేని నీ జీవితాన్ని
దబ్బున మార్చన నాని
ఊబిలోని నీ నమ్మకాన్ని
లాగన ఈ క్షణమున పైకి
నాకు వెయ్యి నీ ఓటుని
నేనిచ్చిన హామీని చూసి
నీకు తప్పక చూపెద స్వామి
మూడు కాళ్ళ ఒంటెని.
ఊరెళ్ళిన భార్య-2

గలగలమనే నీ గాజులు లేక
గ్లాసులోని ఐసుల గోల
చల్లదనాల నీ నవ్వు లేక
ఐసుల గ్లాసు తాక
తీపినిచ్చే నీ పెదవి లేక
అందుకున్న మందు చుక్క
మత్తుగ తాకే నువ్వు లేక
తాగుతున్నా లెక్క లేక.
ఆబిట్యూఅరి

నేను పీల్చే గాలి
ఖర్చు ఎక్కువ అయ్యి
నా ఊపిరిని
ఔట్సోర్స్ చేసేసా!

Tuesday, October 7, 2008

జాని వాకర్

బయట జోరుగా కురిసే వర్షం
కిటికీ లోంచి, కాలి నుంచి
వంటినంటి సోకాలన్న చలి ప్రయత్నం
పచ్చి బియ్యపులాంటి నా దేహం
బొట్టు బొట్టున నీవు జార్చే ఉష్ణం
మెల్ల మెల్లగా ఉడుకుతున్నా సాంతం
వేడి మరీ ఎక్కువయ్యేతే మాత్రం
ఇంతటితో ఆపాలన్న ప్రయత్నం
అది కుదురుతుందో లేదో చూద్దాం...
ఊరెళ్ళిన భార్య

ఏమని పొగడను
నీకు పనిచ్చిన దేవుణ్ణి
నిన్ను ఊరెళ్ళమన్న జీవుడిని
బండెక్కిస్తున్నా నీ నాధుణ్ణి

ఎక్కడని మొదలెట్టను
నాకు కలిసొచ్చిన ఫ్రీడంని
ఇక దరికి రాని బోర్డంని
ఏలబోయె ఈ కింగ్డంని


ఇంటిలోని వంట
నేనేమాత్రం ఎరుగనంట
టీవీ లోని మూవీ
ఓయి ఎంతకూ ఆగవేమి
మూత తెరిచిన సీసా
కొరుకుతున్న సమోసా
కాలం ఇక్కడితో ఆగితే చాలు
పైవాడికి కోటి దండాలు

Tuesday, September 30, 2008

పరీక్ష

ఓ కలమా వివరించవే
కనిపించిన ప్రశ్నకు
బదులు లేదని

రాతిరంతా చదవలేక
విసిగి ఉన్నా నిద్ర చాలక
బైర్లు కమ్మిన కళ్ళతోటి
ఎదురు వచ్చిన ప్రశ్నలు కోటి

ఓ కలమా...

చదివిన వేళన అర్థమైతే
మరు క్షణాన వ్యర్థమైతే
ఏమి రాయను, ఏమీ రాయను
"ఏమిరా?" యను, ఆత్మలు నన్ను

ఓ కలమా...

అసలిది కనిపెట్టినదెవరు
మాకు ఇబ్బందులు మొదలు
ఇది గట్టేక్కినంత మటున
నాకు కొమ్ములు మొలచిన మాటనా

ఓ కలమా...
పువ్వు

ఆమె తలలోన వాలనా
లేక గుడిలోన చేరనా
దారి తెన్ను తెలియని
తుమ్మెదని దరి చేర్చనా

సువాసనలు పేర్చనా
పూజ వేళకు నమస్కరించనా
తోటి సోదరులతో కలిసి మెలిసి
తోరణమై నిలవనా

పెళ్లి సంబరమైతె నేమి
మృతి చెందిన దేహమేమి
వాడనంత సేపు మటుకే
మాకు విలువ కట్టు మనిషి బతుకె
ఆకు

మట్టిలోని అమ్మలు
మీలో నీరు తాగినదెవ్వరు
నేను చిగురించే ముందర
లేదేపువ్వుకి తొందర

తోటకూర కట్టలో
పాలకూర తట్టలో
బాదం చెట్టు కొమ్మలో
కొట్టిన అరటి చెట్టులో

రవి కాంతి వల్ల పెరగనా
క్లోరోఫిల్లు లేన చేదరనా
నా పచ్చ వన్నె బంగారం
మీ ఇంటి తోరణ సింగారం

నా మీద పడ్డ నీటి చుక్క
ఆడెనంట చకా చకా
నేను చుట్టుకున్న పోక చెక్క
మీ నోటిలోన అయ్యె ముక్క
నిశ్శబ్దం

గాలి వీచని
ఆకు కదలని
తెర ఊగని
పగలు వీడని

గుండె పలుకని
మనసు కదలని
ఊపిరాడని
చూపు మెదలని

ఆశ తీరని
గమ్యమెరుగని
విధి సాగని
మది చూడని

ఆత్మ కలవని
కాంతి వెలగని
చూపు కుదరని
వీణ మోగని

Tuesday, September 9, 2008

వరుడు కావలెను

కావలెను
మా సుకుమారి టిన్నుకి వరుడు కావలెను
ఎత్తుకున్న చెవులు
జారుతున్న జూలు ఉన్న వరుడు కావలెను
రెంటి కాలి నడక
దించుకున్న తోక ఉన్న వరుడు కావలెను
రుచికరమైన వంట
రోడ్డు మీది పెం.. కోరని వరుడు కావలెను
కట్నం మీద మోజు
గుమ్మం ఎదురుగ పోజు లేని వరుడు కావలెను

కాని కుక్క బతుకు కాజాలదు.
గొడుగు

నా నెత్తి మీద టపా టపా
తెరిస్తే నీ నెత్తి మీద టపీ టపీ
కాని ఆ చివ్వరున్న చిల్లులోంచి
నా భుజం మీద టపూ టపూ

కింద అడుగేస్తే టపె టపె
విదురు గాలికి నువ్వు టపం టపం
మీద బట్టలన్నీ టపుష్ టపుష్
మళ్ళీ నా నెత్తి మీద టపా టపా
కాలం

ఓ కాలమా నీవెంత కఠినం
పొతే రావు, వస్తే ఆగవు
అవసరాన నిలువవు
వేదనలో కదలవు
ఏ క్షణాన్ని విడువవు
మరు క్షణాన్ని ఆపవు

నీలో మార్పు సహజమా
అది కేవలం చూపుల మర్మమా
నీతో నవ్వమందువా
ఏడుపు తప్పదందువా
నిన్ను విడిచి వెళ్ళినా
మా పిల్లలిని సాకకుందువా
శుభోదయం-4

నా ప్రాణములో ప్రాణమై
ఇన్నేళ్ళుగా నాలో జీవమై
తెల్లారిందని తెలిపి
నీ నవ్వులతో నన్నూపి
గల గలమంటున్న కప్పులో
కాఫీ పరిమళాల విరిజల్లులో
నిద్ర లేవమంటున్నావా ప్రేయసి
ఆదివారాలు చూడరాదే
నన్నొగ్గేసి

Thursday, September 4, 2008

గుడ్డు

నువ్వు ముందా, మీ అమ్మ ముందా
పిల్లల పెరుగుదలకి నువ్వు మందా
ఈస్టరొస్తే నిన్ను వెతకమా అంతా
గుండెనొప్పిలో నిన్ను మరువమా కొంత

కొందరిలో జుట్టున అంట
కోరినచో కూరల వంట
కొంచంగా కేకులొనంట
కోపంలో ప్రేక్షకుల విసురుల పంట

కాస్తలొ పగిలే గుణం
వెచ్చదనాన పెరిగే ప్రాణం
కాని కోడివి, బాతువి నావి
ఆ గాడిదవి మాత్రము నీవి
అసలు

మనిషిని చూశాక ఇంతేనా అని
నవ్వుని చూశాక ఇదేనా అని
మాటను విన్నాక ఇది మామూలేనా అని
మనసుని కన్నాక అసలిదేనేమో అని
మరి...
మొదటి గ్లాసు ఇంతేనా అని
రెండొవ పెగ్గు ఇదేనా అని
మూడవది ఒట్టి మామూలేనా అని
సీసా అయ్యాక అసలు ఇదేనేమో అని

Tuesday, September 2, 2008

శుభోదయం-౩
(భార్య భర్తతో...)

సూర్యుడొచ్చాడని లేపనా
నిద్ర చాలించమని లేపనా
నాకు మెలుకవని లేపనా
ఆఫీసు వేళైందని లేపనా
పాలు పొంగించానని లేపనా
డికాక్షన్ అయ్యిందని లేపనా
కాఫీ కలిపానని లేపనా
పనిమనిషి రాలేదని లేపనా?

కళ్ళజోడు

సాధారణంగా కళ్ళెదుట
నీడొస్తే నెత్తి మీదట
నిదరోతే పెట్టెలోనట
అప్పుడప్పుడు చొక్కా నీడనట

ఆటలాడితే మడత పెట్టుట
స్నానమాడితే దూరమేనట
కింద పడితే చెత్తలోనట
లేసిక్కు వల్ల నే హిస్టరీయట
శ్రద్ధాంజలి
(మరణించిన మా అన్నయకై...)

మన చిన్నప్పటి స్నేహం
మరువలేను నేస్తం
నీ తమ్ముడినైన నాకు
పంచిన శాంతం, సందేశం

వణకిన నా కాళ్ళకి
నీ వాక్కులు ఒక పునాది
అదిరిన నా గుండెకి
నా భుజం మీద నీ చెయ్యేది?

మిస్సింగ్ యు...

Friday, June 27, 2008

నీ రాక కోసం

నువ్వు వీడిన క్షణాన, నే తాళలేక
నీ వెంట రావాలని, ఉబలాటమూగా
నువు చేరు గమ్యం, నీ సొంతమనగా
నా మనసు కొంచం, చింత పడెగా

నీ రాక కోసం, రేపొకటి వస్తుందని
నెలవంకను దాటి, సూరీడు వస్తాడని
ఎదురు చూశాను నేస్తం, నీ పిలుపు వ్యసనం

ఒక ఆకు రాలితే, వేరొకటి మురిపెం
వ్యసనం

సిగరెట్టు ఒక ముద్దు లాంటిది
ఇదొక్కటే చాలు, ఇదే చివరదని
ముద్దు ఒక పెగ్గు లాంటిది
దీని తరువాత, ఇంకొకటి వద్దని
పెగ్గొక జోకరు లాంటిది
దీనితో ఆట ముగుస్తుందని
జోకరు నిస్సందేహంగా ఒక జోకరు
అది మిధ్యే గాని నిజం కాదు

Wednesday, June 25, 2008

రాయి

కొన్ని సార్లు మనసు;
కొందరికి దేవుడు;
నూ చేసిన మైసూరు పాకుని తినకుండానే తెలుసు;
బాధల్లో గుండె;
కొన్ని చెప్పుల్లో ఉండే;
శంకుస్థాపం రోజున;
శిల్పి చెక్కిన పోజున;

కాగితం మాని కంప్యూటర్తో;
ఎదుటివాడి నుదుటిపై నీ బోధనతో;
వేడిక్కిన తలని నూనెతో;
ఈ వేళ వంటిని గంధంతో;

శ్రీ రామ కోటిని;
చలిబెట్టిన చేతిని;
సాయంకాలపు వీపుని;
గాయానికి మందుని;
తలపై కుక్కని;
భోంజేసిన బొజ్జని;
ఆకుపై సున్నాని;
ఉబుసుపోని కవితల్ని;

Tuesday, June 24, 2008

సైకిల్

రెండు చక్రాలు తిప్పి, గమ్యం వెంట పరుగులు తీసి
నేల, ఆకాశం మధ్య, నిలబెట్టిన మిత్రమా
గాలి విసురు తోడైన వేగం, ఎదురైతే సగం
నిత్యం నా ప్రయత్నాన్ని గుర్తుకు చేసే వైనం
నూనె లేక సంకోచమా, గాలి చాలక సంకటమా
బాధ నీదే కాదు, నీ వెంట వచ్చే నాదీ కాదా
పెట్రోలు ధర మండే గుండెలో, నీ సుఖమే నాది కూడా

Friday, June 20, 2008

గుడ్ నైట్...

మేఘాల వంతెన, గగనాన దొరికెనా
ఈ హంస నడకన, సంగీతం మోగెనా

సోకుల సాయంత్రమా, నవ్వే ఓ మంత్రమా
మల్లె పూల గంధమా, ఆమే నా స్వంతమా

పట్టు పరుపు దీవెన, ఏకాంతపు సేవన
కోరిన నీ చెంతన, ఆడించిన మంతన

బట్ట నీకు బరువునా, బోధన నే చేతునా
కాసింత వెన్నెలన, మూసిన ఆ కన్నులనా.
చుక్కేసి చూడు...

కొన్నే చుక్కలు, మరచిన చిక్కులు
కాసింత పప్పు, ఓ గాధ చెప్పు

వలచిన పిల్ల, లేకుంటె ఎల్లా
వళ్ళంతా గుల్ల, ఆమె దొరుకట కల్ల

ప్రేమకు అర్ధం, వెతకుట వ్యర్ధం
తెలిసిన తధ్యం, వేసేయ్యి మద్యం

కాశే లేదా, రాశే రాదా
వేదాంత కాలం, వేదన రాగం

మరికొంత పప్పు, ఓ గాధ చెప్పు
ఎన్నో చుక్కలు, కలవని దిక్కులు

Wednesday, June 18, 2008

కలలో...

కన్నులు మూసి నిద్దర పోతే కల వస్తుంది
ఆ కలలోనేమో సన్నగ నవ్వే వినిపిస్తుంది
నిద్దర లేచి వస్తానంటే నవ్వేస్తుంది
పోనీ దగ్గరకెళ్ళి చూద్దామంటే దాగేస్తుంది

మూసిన కన్నుల ముందర తాను ఆడేస్తుంది
మెలుకువ లేని వేకువ జామున పాడేస్తుంది
పక్కకు చేరి పడదామంటే తోసేస్తుంది
పోనీ తానే నడిచి వస్తుందంటే ఆగేస్తుంది

కన్నులు మూసి...

ఇప్పుడే కాదు, అప్పుడే కాదని ఊరిస్తుంది
చప్పుడు చెయ్యక చూపులతోనే చంపేస్తుంది
తొందర పడక చీకటి దాక ఉడికిస్తుంది
కన్నులు మూసి నిద్దర పొతే నడిచొస్తుంది

కన్నులు మూసి...
నీరు

సెగలో, ఆవిరిలో, సంద్రంలొ అలలో
చెరువులో, నదిలో, గోదావరి వరదలో
చెమటలో, కన్నీటిలో, మూడొంతుల బరువులో
మబ్బులో, వానలో, ఇంటి ముందు చినుకులో

పాలలో, చారులో, బారులోని బీరులో
కూరలో, సాంబారులో, ఊరించబడ్డ నోటిలో
ఒంటెలో, రొంటిలో, నెత్తురున్న వంటిలో
ఆకులో, పండులో, గుర్తుకొచ్చిన ఎండలో

ప్రాణమున్న జీవిలో, జీవమిచ్చే బావిలో
నీవు లేక ఎందరో, వేసవిలో ఉండరో.

Tuesday, June 17, 2008

లాటరి

తగిలితే సరి, లెక్కలేనంత సిరి
లేకపోతె మరి, చిన్న రొక్కం హరి

పెద్ద మొత్తం నిన్ను కోరి, ఎప్పటికి తగలని గురి
అలవాటయ్యిందో గిరి, కాగలవు బికారి
మాన్సూన్ రైన్...

అడుగు దీసి అడుగు, నెత్తి మీద గొడుగు
వానపడ్డ తరువాత, ఎటు చూసినా మడుగు

కాలు పెట్టి చూడు, నేల తగిలితే మేలు
నీ మీద బురద చల్లే, ఆ కారు స్పీడు చాలు

చీర ఎత్తి నడిచినా, ప్యాంటు మడత పెట్టినా
రోడ్డు మీద ఆవేసిన సంపద నీట కలిసెనా

కాబట్టి...

చింత పక్కనెట్టు, గొడుగు విసిరికొట్టు
వానలోన తడుచుకుంటూ ఇంటి దారి పట్టు
రెంటల్ అగ్రీమెంట్

ఏడంతస్థుల మేడ ఇది
కరెంటు పోయిన లిఫ్టు అది
ఎక్కే మెట్ల నడుమా నాది
ఎత్తుకు వెళ్ళే నాధుడేడి

కొట్లో సరుకులు తెచ్చు నాడు
ఒకటో రెండో మరచి చూడు
ఈ ఇంట్లో ఎవడూ ఉండలేడు
చూసేవారికి నవ్వుట. ఇక ఏడు.

Monday, June 16, 2008

మార్గరీట

కలిపి చూడరా టెకీల
తాగుతుంటే అది కిక్కీలా
పేరు చూస్తే మార్గరీట
పుచ్చుకుంటే మనసు తకిట

దొరుకుతున్న ఇన్ని రంగుల్లొ
పారుతున్న బారు మలుపుల్లొ
తాగినప్పుడు లేని లెక్కల్లొ
ఊగుతున్నా ఇంటి సందుల్లొ
శుభోదయం-2

లేస్తున్న రవిని చూసి, నిద్దరను పక్కకు తోసి
మనసంత పందిరేసి, నవ్వులతో దండ చేసి
వేడి వేడి కాఫీ పోసి, తియ్యదనాల ముద్దరేసి
నిల్చున్నా ముందరేసి, చూస్తున్నా నీ కళ్ళకేసి
వద్దబ్బీ... కావాలమ్మీ...
(పరుగు సినిమాలో ఎలగెలగా పాట రాగంలో...)

అబ్బీ, నువ్వెందుకు నా వెంట వస్తావు
సాగే నా దోవలో నువ్వడ్డుపడతావు
వద్దన్నా పాడు గోల ఎందుకు పెడతావు
చూసే నలుగురిలో నవ్వుల పాలు చేస్తావు

అమ్మీ, నీ చూపులే నాకు గుచ్చుకున్నాయి
విసిరే నీ నవ్వులే సంకెళ్ళు వేశాయి
ఊగే నీ నడుమే నన్ను తట్టి లేపింది
కొరికే నీ పెదవే మది కితకిత పెట్టింది

అబ్బీ, ఆలస్యం అయితె అమ్మ తిడుతుంది
విషయం నాన్నకు తెలిస్తే తాడు తెగుతుంది
ప్రేమ దోమ అంటే ఊరుకుంటారా
గదిలో తాళం పెట్టి తన్నకుంటారా

అమ్మీ, ఇంటికి వచ్చి కాకా పడతాను
అవసరమైతే కాలాన్ని ఆపి వేస్తాను
తాళమేసిన గదికి నే వెంటనే వస్తాను
ముడిపడివున్న మదితో నే తలుపులు తీస్తాను

Friday, June 13, 2008

పిల్లాట

నల్లది వద్దుట, గోడ మీదది ఎటుట
చిట్టెలుకల మధ్యన, గంటెవరు పెట్టుట

చంకలోనే వుందట, ఊరంతా వెతుకుట
అడిగినా బిచ్చం లేదట, ఊరికే పీనాసట

తన కన్నులు మూతట, పాలు తాగేదెవరు చూడరట
నీ పక్కన చేరిందట, మ్యావు మ్యావుల మూట
గ్రాడ్యువేషన్ పార్టి

పాపగా వచ్చాను, బాలుడిగా పెరిగాను
మనిషిగా మారి నే ఇల్లు దాటి వెళ్తాను

అమ్మ నన్ను పెంచింది, నాన్న ప్రేమ తెలిసింది
అన్న హితవుల సందేశం, వెంట తోడు వచ్చింది

బయట చలి కరిచింది, వంటినంత కొరికింది
ఇంటిలోన దొరికిన, వెచ్చదనం తెలిపింది

నా కంటూ ఒక ఇల్లు సమ కూర్చాలనుంది
అందులోని ఆనందం తెలుసుకోవాలనుంది

Wednesday, June 11, 2008

సమయం

కొన్ని క్షణాలు వింత కావా
మొండితనము పట్టు కాదా
త్యాగబలం స్వార్థమవదా
స్వార్థమే నీ ప్రేమకాదా

కొన్ని పనులు చింత కావా
యుద్ధములో అతడి చావా
బలముకలదనంత చావ
పెద్దలైతె మీదే త్రోవా?

పండు తీరు నీవు కాదా
ముందు కోస్తె చేదు రాదా
ఆలస్యము ఒక కుళ్ళు బాధ
సమయమైతె తీపి కలదా.

Tuesday, June 10, 2008

ఆరు దాటి...

ఆరు దాటి పొద్దున గంటయ్యింది
కాలేజికి బస్సు పట్టె వేళయ్యింది
అమ్మది వంటయ్యింది
ఫీసుకి టైం అయ్యింది

సినిమాకి డబ్బులడగాలని వుంది
ఒక్కరికి కాదులే ఇద్దరికంది
ఆపై ఐస్ క్రీమ్ అంది
బీచిలో సన్ స్క్రీన్ అంది

ఆరు దాటి...

టీచరమ్మ లెక్చరు ఇవ్వాలంది
వినకపోతే బెంచి మీద ఎక్కమంటుంది
క్లాసులు ఎగ్గొట్టి
గుంపును చేబట్టి
గోడ దూకి మ్యాటినీకి వేళ్ళాలనుంది

ఆరు దాటి...

ముందు చూస్తే ఎగ్జామ్సు మోగేట్టుంది
ఇంతవరకు చదవలేక వాచేట్టుంది
అయినా ఇల్లోకటుంది
అమ్మది ప్రేమొకటుంది

ఆరు దాటి...

Monday, June 9, 2008

పాయసమిస్తా...


సన్న తీగల సేమియ వేసి, పాలలోన నానేసి
కోరినంత చక్కర పోసి, చేసివుంచారా కాశి

కోపమెందుకు నన్ను చూసి, బాధ పెట్టకు తలుపులు మూసి
నిద్దరంతా నువు కాజేసి, తోచనట్టు తల గోకేసి
రారా ఇంటికి పాయసమిస్తా, దగ్గరుండి తినిపిస్తా
నీకు సందేహం ఎందుకు, చెంతచేరిన ఈ పిల్లే పిస్తా

సన్న తీగల సేమియా వేసి...

ఆకలేస్తే నేను లేనా, కొరికి చూస్తే కాజా కానా
ఒక్కసారి చేరువైతే, దాటలేని బంధికాన
తెలుసు నాకు నీ సంగతి, పిల్ల తోడు కోరిన కుంపటి
చెంత చేరి చూడర ఇప్పటి, ఆటలాడిన కప్పిన దుప్పటి

సన్న తీగల సేమియా వేసి...

చింత వలదు

నువ్వు గుర్రం కాలేదని, చింత వలదే కంచర
నీది తోకే పెద్దది అయితె, ఎగరగలవు కళ్యాణిలా
మూతి ముడవకె, పెద్దగ నవ్వవే,
నడుము పెంచవె, జుట్టు దించవె

నీకు హంగులు లేవేమోనని, బాధ చెందకె కంచర
నీది సకిలింపేగనకైతే, కీచు గొంతులు మానవా
వంగ మాకె, పొడుగుగా నిలవవె
నడవ మాకె, పరుగులు తీయవె

నువ్వు గుర్రం కాలేదని...
సాంబారా

నా ముందు ఆత్రంగా నన్నారగించమని అడగాలా
మూతకింద దాగియున్న మరిగించిన సాంబారా
తలుపుతీసి ఇంట్లోకి మేమేమన్నా రావాలా
రోడ్డుమీద వెళ్తుంటే ఘుమఘుమలు చాల!
దోబూచులాట...
(కృష్ణార్జున సినిమాలోని త్రువటబాబా పాట రాగంలో...)

దోబూచులాట ఆడకే దేవి
వచ్చాను నీవెంట నిను కోరి
పక్కకు తోసి, మనసుని దోచి
ఇబ్బంది పెట్టకె చకోరి

కళ్ళతో వెంటనే కట్టేసి
చూపులతో గట్టిగ చుట్టేసి
నవ్వుల పరుపును పరిచేసి
ఊహలతో నన్ను వాటేసి

దోబూచులాట...

కొంగుతో నీతో ముడివేసి
మనసులు రెండు జత చేసి
చేతిలో చెయ్యి మెల్లిగా వేసి
తోడు రావే నడిచేసి

దోబూచులాట...

Saturday, June 7, 2008

పువ్వులు

పూచిన కొమ్మలను మీరు వీడని
విప్పిన రెమ్మలను మమ్ము చూడని
పుట్టిన ఇంటి అందాలు దాటని
మెట్టెనింటి వరకు వాటిని చేరని
రేఫిరీ

ఆకుపచ్చ మైదానం, పరుపు తీరు ఆహ్వానం
సన సన్నటి గాలికి, దూరపు పక్షుల ఆనందం
చుట్టూరా వేల జనం, జోరున హోరుల మయం
క్రీడాకారుల ద్వయం, ఇంకెందుకు ఆలస్యం
కదలిరా నేస్తమా
(
కే సెర సెర పాట రాగంలో...)


నీ కోసం ఎంత సేపని
ఎదురు చూడాలి ఈ రోజు
సమయం ఆగేదాకా
నిన్ను మరిచేదాకా
మబ్బులు వీడేదాకా? ఎందాక?
కదలిరా నేస్తమా
నీ ఆలోచన నా స్వంతమా
వేచియున్న నీ మిత్రమా

ఈ మెత్తని పరుపులను మల్లెలతో
పరచివుంచాను ఈ వేళ
నీ కోసం చూసి
గంధం రాసేసి
వేచియుంది నీ రాశి

కదలిరా నేస్తమా...

విడచిన మబ్బుల వెన్నెల
నీ రాకను తెలిపింది
ఇది గాలిలో తేలిన క్షణమా
పాడిన కోయిల స్వరమా
మనసులు కలిపిన కావ్యమా

కదలిరా నేస్తమా...

Thursday, June 5, 2008

స్థాన బలిమి

ఇటువైపున సున్న, అటువైపున వున్నా
రచ్చ గెలవకున్నా, ఇల్లు పదిలమన్న

ఎంత కోరుకున్నా, పిల్ల నీదియగునా
తల్లి చేరదీస్తే, వేరు నీడ తగునా

కన్ను నీరు పెట్టినా, నోరు నొప్పి పుట్టినా
ఎన్ని మాటలాడినా, వాటి బాధ తెలుపునా

ఆటలాడుతున్నా, చదువులెన్ని వున్నా
నువ్వు మెచ్చియున్న, పని చేరువ, అవునా?

Tuesday, June 3, 2008

ఆరడుగుల అందగాడ

ఆరడుగుల అందగాడ
నాకోసం సందెకాడ
వేచియున్న కొంటెవాడ
కాగలవు తోడు నీడ

మన ఇద్దరి ఇంట నీడ
మనసులు కలిసిన జోడా
మాటలు రాలిన జల్లెడ
ముత్యములే పట్టిజూడ
పిలుపు

మీదకు నీటి చుక్క రాలినపుడు, ఆకుకు మల్లె
మోగిన గంటలు విని, హారతి కొన్న దేవుడి మల్లె
పొంగిన వాగును చూసిన, ఆనకట్టకు మల్లె
చింతలో పాపల పిలుపుకు, తల్లి మనసు కదలాడే
తువ్వాలు

స్నానమాచరించావా, నన్ను పిలువు
బయటకు రాదలచావా, నడుమును కొలువు
వేసవి మండేనా, తల చుట్టూ తొడుగు
గాలికి ఎండేనా మడతబెట్టు, ఇంక శెలవు

Friday, May 30, 2008

గతమే భవిష్ష్యత్తైతే...

నీ సంగతంతా తెలుసుగా
ఇక నీతో పనేముంది
నాకు జరగబోయేది ఎదురుగా
లైఫ్లో ఫన్ ఏముంది

నే నేర్చుకున్న పాఠమేంటో
ఎదురు చూశే వాటివెంటో
జ్యోతిష్యుడితో పనిఏంటో
దినము దాటి రాతిరేంటో

అందుకే...

ముందుకాలం మక్కువేగా
తెర వెనుక చిత్రమేగా
దాచినంత సత్యమేగా
ఇంతలో తొందరేలా?
కుర్చి

నేను కదలను
విమానంలో నిన్ను వదలను

నేను నడవను
పరీక్ష హాల్లో నిన్ను విడవను

కొన్ని సార్లు నే మెత్తన
నడుం పడితే నేను వత్తనా

ఇంటికి అతిధి వచ్చెనా
తగిన మర్యాద చెయ్యనా

ఒకవేళ అతిగా నన్నూపెనా
నడ్డితో వంతెన కట్టనా
జడ

చేతితో అల్లిన ఓ సర్పమా
మంచి నూనెల సుగంధమా
పూసిన మల్లె నీ స్వంతమా
ప్రియుడి అల్లరికి చిరు కోపమా
ముందుకి వాలితే శాంతమా
విప్పిన ముడి అతడికాహ్వానమా
నా కలలో నిలపనా...
(ఐ కాన్ డ్రీమ్ అబౌట్ యు... daan hartman పాట ఆధారంతో)

మనసులోని మాటలు
దాస్తావు నువ్వెందుకు
వెతుకుతున్న చూపులు
తెస్తావా నా ముందుకు

నా కలలో నిలపనా
నిన్ను రాతిరంతా
నా తలపు తెలపనా
కోరుకున్న వింత

వచ్చినట్టే వచ్చి మాయమౌతావు
ఉండరాదా ఈ విందుకు
మనసంతా గిచ్చి గిచ్చి పారి పోతావు
ఈ ఆటలింకెందుకు

నా కలలో నిలపనా...

ఉత్తుత్తిగా ఊరిస్తే లాభమేముంది
మన ప్రేమకర్ధమేమిటో
సిగ్గేసి వెనకాడితే తీరు తెలియకుంది
మన బాటలు కలిసేదేపుడో

నా కలలో నిలపనా...
కాల చక్రం

గిరగిర బండి
ఆపితే ఆగదు
ముందుకేగాని
వెనుకకు సాగదు

జీవితమంటే అంతే అర్ధం
విడిచిపెట్టు నీ జరిగిన గతం
ఎదురు చూసిన రేపు తోటి
నేడే వెయ్యి అడుగులు దాటి
పాపం పుస్తకం

తల ఎత్తని, కన్నార్పని
పీల్చే ఊపిరి వినపడని,
కాలూపని, జడ కదలని
చెవిలో మాటలు వినపడని,

నీ చూపులను పుస్తకం
ఓపలేదు నేస్తం
ఆ సంగతి నన్నడిగితే
తెలుపలేనా సమస్తం
ఇది జుట్టా?

గాలికి ఎగిరే పావురమా
నిద్దర లేచిన, నిటారమా
నూనె పట్టని చదారమా
పేనులు మెచ్చిన గోపురమా

దువ్వెనకందని సంకటమా
చెబితే వినని కావరమా
నూ చిక్కటి అడవి కావడమా
భగ్గున మంటలు పెట్తెదమా
బొగ్గు

వంట ఇంట కుంపటింట
చాకలోడి పెట్టెనంట
ఓ నాటి నోటినంట
పళ్ళపోడికి బదులునంట

గోడ మీది రాతలంట
చిత్రించిన బొమ్మలంట
చలికాలపు ప్రేమ జంట
కాచుకున్న చలి మంట

రైలు పెట్టె తోసేనంట
నలుగురికి విద్యుత్తంట
ఇన్నేళ్ళు ఆగెనంట
మెడలోని వజ్రమంట

Thursday, May 29, 2008

బొద్దింక

దీపమార్పి చూడు
వంటయింటి గోడు
చెత్త చుట్టూ ముసురు
ఇంటిల్లిపాది కసురు

మీసమున్న పొగరు
పిల్లలకు మేం బెదురు
పిరికివారు అదురు
మాకు చీపురిచ్చె కుదురు
అల్లం చాయి

మబ్బు ముసిరి, రవి దాగి
వాన కురిసిన వేళ
గాలి విసిరి, చలి
సోకి
ఇంట దాగితివేల?

అల్లమేసి, చక్కరపోసి
మక్కువతో చేసిన
చాయి
నా ఇంటికి, విచ్చేసి
కొంచమైన తాగవోయి
ఆహ్వానం

సందేహానికి సమయమా
ఇది సంకోచానికి తరుణమా
సాయంకాలపు ప్రణయమా
ఇది శీతాకాలపు సరసమా

హద్దు పద్దు వద్దని,
నీ నవ్వే నాకు ముద్దని
వద్దకు చేరే, చెక్కిలి కోరే
విసిరే వింత వలయమా

నీ రాకకు చేసిన ఆహ్వానం
నీ సొగసే నాకొక మధుపానం
చెంతకు చేరే, జంటను కోరే
నా ప్రేమే చూపిన ప్రళయమా
కొవ్వొత్తి

చీకటిలో నీకందించిన నా చిరునవ్వు
అంతవరకు కానరాని నీ దారికి చోటివ్వు
కాని ఎక్కువ సేపు నిలవలేను, నేనొక కొవ్వొత్తి
ఆగేలోపు కొనిపో, నేనందించిన ఈ జ్యోతి

Wednesday, May 28, 2008

డు నాట్ డిస్టర్బ్...

ఆఫీసొక నడి సముద్రం,
చిక్కుకున్న పనుల అలల వలయం;
ఈ జీవికి, ఎకాగ్రతకు సమయం,
దైనిక జీవనోపాదికి
ఆదాయం;
మరి...
మదిలో నిలిచిన సుందర,
పరుగులు తీయకుర నా ముందర!

Tuesday, May 27, 2008

నవ మాసాలు
(
జమైకా ఫేర్వెల్ - పాట రాగంలో)

ఎక్కడైతే నవ్వులో, పాపలు వేసే చిందులో
అప్పుడే అది పండగో, అవి రోజూ వచ్చే వింతలో
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా తొమ్మిది మాసాలే

గోల చేసే అరుపులో, వేసే తప్పటి అడుగులో
నీ గుండె మీద గంతులో, లేక బట్టల మీద
మడుగులో
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా ఎనిమిది మాసాలే

ఆట పేరుతో పరుగులో, పాట పేరుతో కేకలో
బొమ్మ కోసం డబ్బులో, మరి అల్లరి చేస్తే దెబ్బలో
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా ఏడు మాసాలే

చదవమంటే బద్ధకం, సినిమా అంటే తక్షణం
పనులు ఇస్తే మానడం, పనికి మాలిన వ్యాపకం
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా ఆరు మాసాలే
...

Saturday, May 24, 2008

మా కుక్క పేరు "ఆగు"

ఆగు, ఇటురా
ఇటు రమ్మని పిలిచాను, ఆగు.
ఆగు, కొనిపో
నీకు ఎముకను తెచ్చాను, ఆగు.
ఆగు, తాగిపో
నీకు పాలు పోశాను, ఆగు.
ఆగు, ఇటురా
ఎంత పిలిచినా కదలవెందుకు, ఆగు?

ఇది డెఫినెట్గా కలే...

చుక్క చుక్క పడుతున్న
చినుకులు తను చూసింది
చుక్క చుక్క పడుతున్న
మధుపానం పోసింది

ఇంటి బయట గగనాన
చుక్క ఒకటి మెరిసింది
ఇంటిలోన నా పక్కన
పక్కన చుక్క చేరింది

Friday, May 23, 2008

శెట్టిగారి ఆబిట్యుఅరి

నీ వీధిలోని శెట్టిని
ఇప్పుడు నీ కాలి కింద మట్టిని
నీ ఖాతా అప్పు పెడ్తిని
పై జన్మలోనన్నా రాబట్టని

కోలాటానికి రా...

చిన్న పిల్లలు గోల చేసి;
పెద్ద వాళ్లు కేకలేసి;
రోజు మొత్తం ఆఫీసులోన
అలసి, సొలసి నీరసమేసి;
వచ్చివున్న రామశాస్త్రి
దండాలను రెండుజేసి
అడుగులోన అడుగులేసి
ఆడవోయి గంతులేసి.

Thursday, May 22, 2008

మావ గోల

ఇదెక్కడి గోలే నా మావది
మార్చేదెలా వాడిదీ పధ్ధతి

సంతకే యెళ్ళాడు, సరుకులే తెచ్చాడు
వాటితో పాటు, సీరొకటి
కొన్నాడు
సీరలో నా సోకు సూతనన్నాడు
సీరలో నే యెళితే సీర లాగేశాడు

ఇదెక్కడి గోలే...

కంసాలి కాముడికి డబ్బులిచ్చొచ్చాడు
బంగారు గాజులు, గొలుసులు తెచ్చాడు
సిరిమల్లె పువ్వువి, సిరి సోకు అన్నాడు
యేసుకుని నే యెళితే ముద్దుకడ్డన్నాడు

ఇదెక్కడి గోలే...

బొజ్జ రామదాసుడి మిఠాయి కొట్లోన
పాల కోవా నాకు తీసుకొచ్చాడు
పేమతో వాడి నోటినొక ముక్కెడితే
నీవుండగా వేరు మిఠాయి లేదన్నాడు

ఇదెక్కడి గోలే...

Monday, May 19, 2008

పరదా

నీ వెనక రహస్యం, దాచాలన్న ప్రయత్నం
నూ గనక లేకపొతే, చూస్తారన్న సందేహం
గాలికి పడుతూ లేచే
సంకటం
పైకి, కిందికి ఊగిసల పోరాటం

పక్కకు తోలిగే వేళ కోసం
వేచియున్న వెన్నెల వాసం

నాన్న గడ్డం

అమ్మా చూడవే, రెండు రోజులుగా నాన్నంట
అన్నం తిన్నా మూతి
కడగలేదనుకుంట
ఆయన చంకన
నేవున్నానింట
గడ్డం మీద చూస్తున్నా, నల్లటి చీమల పంట

Saturday, May 17, 2008

కళ్యాణ రాగం

తాళి, మంత్రం, పుష్పం, అతని వెంట తరుణి
చుట్టూ బంధు వర్గం, నడిపించె ధరణి
నూతన దంపతలూహించె, తము సాగు బాట
వెంటగ వచ్చిన వీణల, మనసులు మోగిన పాట

Friday, May 16, 2008

శుభోదయం

ఘల్లు ఘల్లు అంటున్న అడుగుల సవ్వడి
తలుపు కిర్రుమంటున్న నిదురకు అలజడి
మెల్ల మెల్లగా వచ్చిన కాఫీ పరిమళం
చేతికందించిన ప్రేయసి శుభోదయం

Thursday, May 15, 2008

పవర్ ఆఫ్ టూ

ఆమెకు పదహారు
ఒకప్పుడు నోట్లో ముప్పైరెండు

తాతయ్య దరి చేరు
ఇప్పుడాయనకు అరవై నాలుగు

నడిచింది అడుగులు ఏడు
షష్ఠిన వేసింది ఎనిమిదివది

అందించారు దీవెనలు నలుగురు
ఇది పవర్ ఆఫ్ టూ

Tuesday, May 13, 2008

ఆపు చూద్దాం...

నిన్ను చూసింది నా తప్పు కాదు
నీ అందంతో నా కనులనాపు


నిన్ను కోరింది నా తప్పు కాదు
నీ మరుపుతో నా మనసునాపు


నిన్ను చేరింది నా తప్పు కాదు
నీ నవ్వుతో నా రాకనాపు


నీ తలుపు తట్టింది నా తప్పు కాదు
గుండె ఘడియలతో నా పిలుపునాపు

నా చెయ్యి జాచింది నా తప్పు కాదు
నీ మనస్సాక్షితో నా చేతినాపు.

దగ్గర బంధువులు


చేతిలొ కొబ్బరికాయి, తీరులొ ఆకతాయి
అవి గుంపులొ తిరుగుతాయి, తిరిగితే గోకుతాయి


శ్రీరాముడితో స్నేహమోయి, లంకేశుడి పతనమోయి
అయినా గుడిమెట్ల మీద, మీ ప్రసాదం హతమోయి


కాశులకై ఆటలోయి, చూసిన వారికి నవ్వులోయి
మీ కోపాలకి ఇకిలింతలోయి, పట్టబోతే పరుగులోయి


ఆకలేస్తే కేకలోయి, మీ తిండి మీద చూపులోయి
అరటిగెల కనిపిస్తే, తల కిందుల ఊపులోయి


రక్కించిన చెవులతో, మన తోటి-బంధువులోయి
అవేగనక లేకపొతే, మనమంతా ఎక్కడోయి?

ఈగ

నీ రాక చూశాక, తినే దోశలపై మూత
మూసుకోని చెవులలో జోరుల హోరున మోత

నూ తిరిగిన దేశాలేంటో, విచ్చేశిన ప్రాంతాల్లెంటో
నూ పడింది మా కంట్లో, తగు స్వాగాతమిస్తాం మాయింట్లో


కత్తి, కర్ర సాము, ఏమీ చేయ్యము మేము
జల్లెడ లాంటి వల, దబ్బున విసురుతాము


మళ్ళీ మావైపొస్తే, జరిగే శాస్తి ఇంతే
అయినా శుభ్రతమున్న చోట, నీకు పనేంటి అంట?

Saturday, May 10, 2008

పెద్దలిచ్చిన ఆస్తి

వద్దన్నా పెరిగే వయసు
రాలుతున్న జుట్టని తెలుసు
ఒకప్పుడు నువ్వూ పదహారు
అది వత్తులువత్తులుగా జారు
ఆ చిక్కు ముడి విప్పే రోజులేమయినాయి
చిక్కే అందని వెంట్రుకలు కరువయినాయి

పోనీ నూనె రాయడం మరిచావా?
లేక ఎండన బాగా నడిచావా?
దువ్వెనలతిగా వాడావా?
బదులుగ దిగుళ్ళు చెందావా?

కాదు...
మీ తాతకు జుట్టే లేదు
మీ వాళ్ళది గుండుల గూడు
ఇంకా తెలియక పోతే
ఓ సారి పాత ఫొటోలు చూడు

ఊరెళ్తే ఎలా?

అతడు ఊరెళ్ళాడని
కోపమా
వంటరిగా ఉన్నావని తాపమా

నిదరే కుదరదని కోపమా
ఈ నిద్దట్లో తాకడని తాపమా

పొద్దున కాఫీ రాదని కోపమా
ఇక పొద్దు ఎరుగుదువని తాపమా

సంగతేంటో తెలియక కోపమా
సందిట్లో లేడేనని తాపమా

ప్రశ్నకు బదులేదని కోపమా
బదులుకి అసలేదని తాపమా

ఊరందరికీ పండగని కోపమా
నీ పండక్కి పండేదని తాపమా

వీణెవరు మీటుతారని కోపమా
మీటే వీణ లేదని తాపమా

అందాలు చూసేదెవరని కోపమా
దోచే చూపులేవని తాపమా

ఇంకా రేపు రాలేదని కోపమా
ఈ రోజు గడిచేదెలానని తాపమా

Friday, May 9, 2008

ఇంక చదవనా?...

చదువుకి తప్పక తెలుసు తనలోని అర్ధం
చదువుకున్న వారు కలిగించు జ్ఞానోదయం

చదివించలేని వాడకి తెలుసు చదువుల తాపత్రయం
చదువులేని వాడు పడుతున్న సంచలనం

చదివీ చదవని వాడిది సంకోచం
చదివితె ఏమోస్తుందన్నవాడిది సందేహం

అతిగా చదివినవాడిది ఆవేశం
అసలే చదవని నాకు ఇదే బహుమానం!

కా-దళ్ ("క" ప్రేమ)

వంపులు తిరిగిన సొంపులు, తలకట్టుతో నీ రాక
అందరి కన్న ముదలు; నీ అందం చూశా


అడుగేసి దిగుతుంటే గుడి మెట్లు కిందికి
ఆర్పని కన్నుల చూపులు; ఆపలేను నీ పైకి


ఎదురొస్తే కోపమా; వాడి కొమ్ముల చూపుల శాపమా
అయినా నీ నడకల కులుకు, నా నుండి దాచకు


నీ బెట్టు నిమిషం వరకే, బహుకరించే కెంపుల కురకే
మూతుల ముడుపులాడకె, ముద్దుల సమయానికే


సుందరి ఇటు వచ్చిపో, ఈ మత్తుని కరిగించుకో
నీవు దూరంగా నిలిచివుంటే, "ఖ" చిత్తంగా దరి చేరుకో


వంపులు తిరిగిన సొంపులు, రాస్తున్నాను నీకు లే...
ప్రేరణ

తుమ్మెదకు పూల పరిమళం, అతనికి ఆమె పరిచయం
పడవకు గాలి సంతకం, ప్రేమకు పెళ్లి పుస్తకం


చేతికి గాజుల హరివిల్లు, ముద్దుకి పాపల చెక్కిళ్ళు
గంటకు పూజల సమయాలు, పాటకు కలిసిన హృదయాలు


ఆకలికి విస్తరాకులు, రాకలకి గంధపు జళ్ళు
పడకకి పట్టు పరుపులు, దుడుకుకి పిల్ల వయసులు


కడలికి అలల నటనలు, కళలకి అందరి దీవెనలు
మనసుకి శాంతి నిలయము, మగువకి అతడి అభయము

Monday, May 5, 2008

చీర (పాడిన పాట...)


నడుమును చుట్టుకోనా, మనసుని హత్తుకోనా
ఆల్లరి మానుకోనా, పిన్నులు గుచ్చుకోనా
గంజిని పుచ్చుకోనా, వానకి గొడుగు కానా
ఎండకు నీడనీనా, రాతిరి విడిచిపోనా


గిన్నెలు వేడి కాన, వాటిని దించి పోనా
కన్నీళ్లు కారుతున్న, వెంటనె తుడవ లేనా
వానలు వరదలైన, పైపైకి కదలలేనా
కూరల సంచి లేన, ముడేస్తే మూటకానా


అందాలు చూపలేనా, బంధాలు కలపలేనా
పంఖాలు లేకపోయిన, బదులుగ గాలినీనా
పిల్లలు భోంచేస్తే, మూతులు తుడిచి పోనా
కాలికి దెబ్బలైన, కట్లన్నీ కట్టిపోనా
అలిగితే భార్యకైన, కంచిపట్టు చీర కానా?

నవ వధువు (కవిత)


వంకర తిరిగిన ముంగురులు
తన మోమున తకిట
సిగ్గుతో సోపిన చూపులు
నటనమాడె యెదుట


తలుపుల సవ్వడి వినగా
ఆమెనేమో వాకిట
ఆగక చిందిన నవ్వులు
పరుగులేసె ముందట


రమ్మని అడగగ తనని
రానని తల
వూపెనట
జారిన పోగులు చెవిన
గలగలమని నవ్వెనట


చెయ్యి పట్టి అడుగేస్తే
గజ్జలు ఘల్లనె మొదట
నట్టింటికి నడిపిస్తే
ఆమెకు అర్ధం తెలుసట!

జోళ్ళు


వళ్ళంతా నలుపుతారు
లోకం, సంఘం, మీరు
మా వాళ్ళంతా నలుపు తారు
ఎక్కి తోక్కిసల తీరు

జంట కవుల జాతర
రోడ్డంతా మాది రా
గుచ్చుకున్న ముళ్ళన్నీ
మీరెరుగని బాధ రా


సోయగమున్నంత సేపు
చూపులన్నీ మా వైపు
చివరికి చిరిగిన బతుకే
మీరంతా అదో టైపు!

ఏకాంతం (ప్రేమ కవిత)


నా ముందు కురిసిన తన సిగ్గు నాకు తెలిపే
దించిన చూపులు ఆమె నోట మాట పలికే
బుగ్గన సొట్ట నన్ను కవ్వించి మురిపించి
ఒంటరి సుందరి ఊరించి మైమరిపించి


పెదవి అందుకోలేని చిన్నారి గడ్డం
కాకూడదు మొమాటం మన ముద్దులాటకడ్డం
సన్నటి పొడుగాటి మెడ, తెచ్చెను నీ వాలు జడ
నువ్వు నేను పంపిన మన మేఘ సందేశం


ఒంటరి తనము నిండిన తోడు లేని మనసుకి
తాకిన గుండెల వెచ్చటిదనమే సంపతి
అందీ అందని నడుము నా చేతులు వెతకగా
వాలిననీ శిరసు నా భుజాలు తాకెగా


ఏకాంతం, సాయంత్రం, తెల్లటి వెన్నెల స్నానం
మన మధ్యన చేరలేక చల్లటి చిరుగాలి కోపం
పడుకున్న కోరికల మేలుకొలుపు గానం
తిరిగి రాని ఈ సమయం కాలమిచ్చిన అభయం.

ఐస్క్రీం


ఉడుకెత్తిన వంటికి హిమాలయపు బొమ్మవి
చవి చచ్చిన నోటికి తియ్యనైన విందువి
రకరకాల రంగుల్లో కరుగుతున్న పొంగులతో
లోట్టలేసి చప్పరించే చల్లటి పసందువి


పాలు మీగడ కలిపిన వళ్ళు దాచుకోలేవు
తాకిన చేతిలోని వేడి తట్టుకోలేవు
రకరకాల రంగుల్లో కరుగుతున్న పొంగులతో
నిమిషము గడవకముందే కరగకుండా ఉండలేవు


బాదం పప్పు రూపు, నాదా తప్పు చెప్పు
నీ వంటిని కప్పిన కిస్స్మిస్, చెయ్య లేను డిస్మిస్
సరసమైన వర్ణాల్లో, సుమధుర సరి పాళ్లో
ఎన్ని సార్లు రుచి చూసిన, తీరని కోరిక ఏదో.

జాప్యం (ప్రేమ కవిత)


ఒకటిస్తావా అని అడిగేస్తే
వీలవ్వదని ను తోసేస్తే
ఆరాటమని నాదనిపిస్తే
మొమాటమని ను నేట్టేస్తే


నా మాటను నే వినలేను
నా బాధను నువు కనలేదు
నా గోల తగ్గేది కాదు
నిశ్శబ్దం జవాబు అవదు


మన చుట్టూ ఎవరూ లేరు
ఏకాంతపు మనసుల జోరు
ఆలస్యం ఓర్వని వారు
ఏ జాప్యం చేయ్యనే చెయ్యరు!

పేరంటమాకట్టు

విందు భోజనహ్వానం, మిత్రుడింట్లో పేరంటం
ముచ్చటైన అలంకారం, భార్యామణి ప్రయోగం
తామెచ్చిన నగలుబెట్టి, సోయగాల వగలపట్టి
ఛూమంతర జాలమా, భామా కలాపమా!

పూజానంతర సమూహం, ఆడువారి సంయోగం
మగవారికి తావులేదు వారి మధ్య ప్రవేశం
ఆమెనెలా పిలిచేది, బయటకెలా లాగేదీ
బామ్మ గారు పసిగట్టి తల మొట్టిన సందేశం

చిట్టి పాప ద్వారా పంపేదా నా మాట
చలి గాలి తొలిగించే వెచ్చటి చెలి బాట
తానేమో రానంది, వగలెన్నో పోయింది
కట్టిన ఆశలమంచు కరిగించి పోయింది

ఎదోటి చెయ్యాలి, గాలమేసి తీరాలి
తనతోటి కలవాలి, నా గోడు విప్పాలి
చూపెట్టు ఒ దారి, జగమేలు సూత్రధారి
కట్టు, బొట్టు, గుట్టు, ఆమె బెట్టు విడగొట్టు!

కొంచం నిద్ర పోనీ డియర్...


అర్ధ రాత్రి దాటింది, నన్ను నిదుర పోనీ
జాబిలోచ్చి గంటలయింది, నా జాగారణ మాని
కనులు మూత పడుతున్నా, ఆవలింతలౌతున్నా
ఎంతకు ఆగని నీ బండ గురక వినలేకున్నా!


కట్టే, కొట్టే, తెచ్చే; రామాయణం
రోజూ నిద్దర చచ్చే; నా పారాయణం
అమావాస్య నిశి అయినా, మెత్త పరుపు సుఖమైనా
మూయని నీ నోటితోన, పగిలే నా చెవులు పోన!

పాలమ్మాయి

అమ్మ మొదలు; ఆవు వరకు;
పెరుగు వడలు; వెన్న చిలుకు;
కోవా, బర్ఫీ, ఏవి? వెన్న నెయ్యి నావి;
ఆశగ మజ్జిగ చిక్కగా; కాఫీ టీలు చక్కగా;
జీడి పప్పు పాయసం; ఎక్కువైతే ఆయాసం;


మరి...


బుట్టలో పాలే లేవా?
నీవి పాల బుగ్గలు కావా!

పిడుగులు (పిల్లలు కాదు...)

మా వయసుకు తెలిసిందల్లరి
మనసులు కోరేది
సందడి

పావు గంటలో అన్నం;
వేకువ జామున స్నానం;
మా ఆలోచనలకు భిన్నం;
మేమెవ్వరి మాట వినం


తాతల పిలకలు పీకుతాం
బురద గుంటలో తేలుతాం
మీలో కలతలు రేపుతాం
సతమతల వల విసురుతాం


పూజ మధ్యలో తకిట తాం
గాలి బుడగలు ఊదుతాం
మా బుగ్గలు గిల్లితే తంతాం
కోప్పడితే మేమేడుస్తాం


మా వయసుకు తెలిసిందల్లరి
మనసులు కోరేది సందడి
ఈ పాటికి తెలిస్తే మంచిదండి
లేకుంటే మళ్ళీ మళ్ళీ చదవండి!

ఫోనాట (హాస్య కవిత)

అమ్మకి ఎదురగా నేను నాన్నతో ఉన్నాను
ఫోనులు మాను శీను, మాట్లాడ లేను
చుట్టూ పిల్లల గొడవ, ఎవడో కంత్రీ భడవ
మాటల్లో ఉన్నప్పుడు చేస్తాడు చప్పుడు

నీకు ముద్దులు కుదరవు; ఎందుకంటె ఏమనాలి
పక్కింటి వాడు చేసిన ఎంగిలంతా తుడవాలి
ఫోనీవేళలో చెయ్యకోయి, ఇబ్బందిలో పెట్టకోయి
ఒక వేళ నే చేస్తే నా బిల్లు మాత్రం కట్టవోయి!
వింతలు

చెట్టు లేని పక్షి, పక్షి లేని గూడు
గూడులేని చెట్టు, కొంచం చూపెట్టు

ప్రేమ లేని తల్లి, పాలు తాగని పిల్లి
గోడ లేని బల్లి, సువాసన లేని మల్లి

భక్తి లేని స్వామి, సర్వాంతర్యామి
వెంట రాని భార్య, చదివించరాని ఆర్య

కరుణించని దేవి, నీరు లేని బావి
సూచన లేని స్నేహం, గోచించని గమ్యం

ఆకు లేని చెట్టు, దాచలేని గుట్టు
పోపు లేని వంట, నీరు లేని పంట

మందెరుగని వైద్యుడు, గౌరవింపని పూజ్యుడు
మొహించని సుందరి, అల్లుకోని పందిరి

బాధించని రోగము, సోదించని ప్రయోగము
కామించని మోహము, ఆశించే వియోగము

మత్తెరుగని మధు పానం, వాయు లేని ప్రాణం
నిలిచిన నడి మంత్రపు సిరి, దించిన గోవర్ధన గిరి.
వెంటరా (ప్రేమ కవిత)

నీ వంటరా? నా వెంటరా
కలవరింతల మది తొందరా?

నా చంటిలా, నిను కాననా
చలి మంటలా, నిను కాయనా
చిరు వానలా, నిను తాకనా
కను పాపలా, నిను సోకనా

నీ వంటరా...

ఏ ఇంటిలో, నీవుంటావో
ఏ చేతిని, చేగొంటావో
నడి రేతిరి, పులకింతలో
అదో మాదిరి, గిలిగింతలో

జేగంటలా, నువు మోగగా
తొలి వాగులా, కల పొంగగా
నీ వంటరా? నా వెంటరా
కలవరింతలా? నువ్వొంద్దంటున్నా.
గుత్తి వంకాయ (వండు విధానం...)

గుత్తి వంకాయ కూర
కూరి చేస్తాను రారా
కడుపు నిండ తిని పోరా!

గోరు వెచ్చన పల్లి
వేయించి పెట్టు చెల్లి
వాటితో పాటు నువ్వులు
కలిసి పోవాలి నవ్వులు

కొన్ని ఎండు మిరపకాయలు
ధనియాలు, ఉప్పు సగపాయలు
పోసి చింతపండు నీరు
రొట్లోన వాటినూరు

వంకాయ పుచ్చు లేక
కొయ్యాలి నాలు పక్క
కూరు రోట్లోని మసాల
ఉడికించు కాయలు ఇవ్వాళ!
పదిహేను ఆగిపో, పదిహేడు సాగిపో

వచ్చీ రాని మీసం, పదహారు ప్రాయం
ఆమెతో తొలి పరిచయం, తెలియదు చేసే విధానం
అమ్మని అడగాలేక, నాన్నకి భయపడ్డాక
నాకేమో చేతకాదు, నేర్పించే వాడులేడు.

ఎదురుగ నిలిచిన తనకి, నాతో కబురాడాలని
నోటి దాక వచ్చిన మాట బయట పెట్టాలని
అమ్మని అడగాలేక, నాన్నకి భయపడ్డాక
తన వల్ల వీలుకాదు; ఇదొక అంతః కలతల హోరు.

మాకీ వయసొద్దు; ఏదో తెలియని హద్దు
ఆశా నిరాశలతో సతమతమయ్యే ముద్దు
పిన్నల పెద్దలకి లేని ఝంఝ్యాటం మాకెందుకు?
సాహసించి సాగేస్తాం పదిహేడున మేముందుకు.
మల్లెలు పూసిన రాతిరి (ప్రేమ గీతం)

మల్లెలు పూసిన రాతిరి
నాతో కలహం దేనికీ
అలకతో తలుపులు మూసి వుంటే
ఆరు బయట మతి పోతూ వుంటే

నే చేసిన తప్పులు ఏమిటో
చూసీ చూడక సాగిపో
ఒంటరి సమయం నీ తోడుంటే
అందమైన కల నిజమౌతుంటే

మల్లెలు పూసిన ...

కవితలు రాసిన వేళలో
నా పాటకు బదులు తెలిపిపో
పాత రోజుల చేసిన బాసలు
ప్రతి దినము ఊహించన ఊసులు

మల్లేలు పూసిన ...
కనికారం (ఒక కొబ్బరికాయ కథ...)

తాట వలిచి, జుట్టు పీకి
తల పగలగొట్టు న్యాయము.
కత్తి దూసి కండకోత
మీరేరిగిన చోద్యము.

ఎదుట వాడు చౌక నా!
చేతికందితే పీక నా!
బండకేసి బాదుడా!
యుద్ధం పోరాడుడా!

మాకున్న రెండు కళ్ళ
లోకి మీరు చూడరా!
చాన్నాళ్ళుగా పేర్చిన
మా సంపదంత దోచరా?

అయినా సరే...

ఎండన ఎండావా?
కండలు కరిగించావా?
దాచుకున్న నీటి బొట్టు
కురిపిస్తా దోసిళ్ళు పట్టు!
సిగరెట్టు (కొందరికి ఎబ్బెట్టు...)

వద్దంటే పిలుస్తావు
ఊరికే ఊరిస్తావు
అయిదే నిమిషాలంటూ
ఆకలి మరిపిస్తావు

పక్కవాడికి సోదంట
ఊపిరాడని బాధంట
మసిపూసిన రూపంట
మానవ జాతికే చింత

అయినా నీ వెంటబడి
కొని తెచ్చిన చేతబడి
రోజుకోటైనా లేకపోతే
మండే గుండెల కోతే!
బద్ధకపు పెళ్ళాం (వద్దు బాబు...)

ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే విడచిన సొగసరి
ఇల్లంతా పీకిన పందిరి
సర్ధలేక పోతున్న వూపిరి

వాకిట ముందర ధూళి
ఇంట్లో పప్పులు ఖాళి
నట్టింట్లో కూడా చెప్పులా?
నిద్దట్లోనన్నా వదలాలి

నిండిన పోపుల డబ్బా
ఎప్పుడు చూశానబ్బా!
పడక గదిలో కూడా గబ్బా
ఇది స్నానం చూడని సబ్బా!

నా పేరు సుందరవదన
అయ్యిందది సుందు నీ వలన
నాకే బద్ధకముంటే
వరాహలక్ష్మి నీ గతేంటే!
అరటిపండు (మరి కాదా?...)

పచ్చ చీర కట్టినప్పుడు, వద్దంది సరిత
ఇతరులతో తనున్నప్పుడు, లాగామంది ముదిత
చేట్టుఎక్కి దించమంది, వూగుతున్న వనిత
కాలు జారి పడకుండా, సాగించు నీ నడత!

కొంచం కొంచంగా, తన గోడు విప్పింది
అంచలు అంచలుగా, తియ్యదనం చూపింది
పట్టు విడువ వద్దంది, పసుపు వన్నెల కవిత
కాలు జారి పడకుండా, సాగించు నీ నడత!

మచ్చలున్న అందాలు, వన్నెకే ఆభరణాలు
నోటి లోన కరిగిపోయే, రుచులకి అవి కారణాలు
వెల కట్ట లేవు అంది, వూరించే వినిత
కాలు జారి పడకుండా, సాగించు నీ నడత!
అప్పు (హాస్య కవిత)

నా దగ్గర ఎక్కువ;
పెంచుకున్న మక్కువ;
నలుగిరిలో లోకువ;
ఇచ్చువారు తక్కువ;

పెరుగుతుంటే దడ దడ;
బంధువులు ఆమడ;
మా ఆవిడేది దేవుడా?
అప్పొద్దుర జీవుడా!

Monday, April 21, 2008

సారీ డియర్ (కొంచం తాగి ఉన్నా...)

ఖాళి కడుపున కుండెడు విస్కీ
తాగిన వెంటనే బాగా కక్కీ
మందు ముట్టితే నీ మీదొట్టు
గ్లాసుతో చూస్తే ఛీ ఛీ కొట్టు

(మర్నాడు ...)

కుంటి సాకుల కోరికలు నావి
పీకల దాక నిండిన బావి
ఎత్తిన సీసా నూ దించమంటే
నా నిట్టూర్పుల చప్పుడు వినిపిస్తుంటే.

అతిధి (హాస్య కవిత)

భోజనానికి పిలిస్తే వంట బాగా చేస్తారని
ఖాళీ కడుపున వాళ్ళింటికి నే వెళితే
గంటైనా కదలరే, గరిటైనా తిప్పరే
కడుపులోని ఎలుకలకి బోనైనా పెట్టరే

గంటలేటు వస్తానని గంట ముందు పిలిచారు
అరగంట ముందు వెళ్లి పకోడీలు తిందామంటే
గంటైనా కదలరే, గరిటైనా తిప్పరే
లోని జీవుడార్థనాదపు గోల కనిపెట్టరే

అంతసేపు ఆగాక వంటలన్నీ వచ్చాయి
ఒకటొకటి తిని చూస్తే మంటలేత్తి పోయాయి
గంటలు దాటి కదిలినా గరిటైనా తిప్పరే
కారం కలవని (నా) కడుపున చెరువైనా తవ్వరే
బోసి నవ్వు (చంటి వాడిపై తండ్రి కవిత...)

నువ్వు నవ్వితే నాకిష్టం;
రోజాంతా పడ్డ కష్టం, ఆలోచనల మాయా జ్వాలం
నీ ముద్దు తో మటు మాయం.

నీ కళ్ళలోకి చూశాను,
బాధలన్నీ మరిచాను
నా గుండె మీద నీ పాదం
ప్రతి సాయంకాలపు వేదం

చంద్రకాంతి నీ నవ్వు
విరజిల్లిన సువాసనల పువ్వు
ప్రకృతి చిత్రాల బహుమతి
మాటలు రాని నీ సాహితి.

గాంధీ తాత (కవిత)

బట్ట తలా, బోసి నవ్వుల, బక్క చిక్కిన
తాతాయి
నువ్వెంత, నీ జాతెంతాయని గొంతులు కొన్ని మోగాయి
నీ గిరి తోటి, సేనా కా పోటి
తెగిన గట్టు నీ
వాఘ్దాటి

యీభూమి నీ వరమేకద
యీగాలి నీవిచ్చిన సంపద
నీ యాలోచనతో, సమ కూర్చినది
ఈ మట్టి నీ స్వార్జితమే కదా.

దయ్యం (కవిత)

నీ మది తలపులు తట్టింది నేను కాదా?
నీ గది తలుపులు కొట్టు నా వీలు కాదా?
రేయిన పోర్లింది ను మెత్తన నే చూడ లేకా?
దయ్యమై వేచియుంట నీ యింటి బయట.

అలుక (కవిత)

నీవు పలుకక ఈ నిశ్శబ్ధం, నీ మనసు తెలియని అయోమయం
నీ కొరికిన పెదవికి అర్ధం కానివ్వద్దు నాకనర్ధం
నీవు కానరాని చీకటి, నీ మాటలు లేక ఆధోగతి
నీవు చెంత లేని వెలితి, చేలియించే సతి వీడిన నా మతి
కనిపించదీ కల్లోలం, గాంచిన మిత్రుల కీ సోకం
సీత రాముల కల్యాణం, కాకపోవచ్చు మనకు ఆదర్శం
బంధు మిత్రుల సందేశం, గాలికి నిలువని దీపం

గుడిలో మోగిన గణ నాదం, నీ రాకకు సూచనా సమయం
కోయిల పాడిన స్వాగతం, తెరిచిన తలుపుల సంకేతం
నీ రాకను తెచ్చిన నిమిషం, కురిపించెను పూల వర్షం
నీ నవ్విన పెదవికి అర్ధం కానివ్వు సాయంకాలపు కావ్యం
సీతాఫలం (కవిత)

నల్లటి గుండ్రాతి కళ్లు పెట్టి నువ్వు చూస్తావు
తియ్యటి సువాసనేంటో తెలిపేలా చేస్తావు
సుతి మేత్తనైన పానుపులా నిను తాకేనా
లోపల తెల్లటి గుజ్జుతో నా కడుపంతా నింపేనా.

పిచ్చుక పిల్ల (తల్లికి పిల్ల పాట)

గుడ్డు పోరలోని బంధీని
గడ్డి పానుపు మీది ఖైధీని
అమ్మ తెచ్చెను నా తిండి
తమ్ముడి గోల వినండి

రెక్కలున్నా ఎగరలేని పిట్టని
నడవలేని బామ్మ తోబుట్టువుని
అరిచినా వినపడని గొంతు నాది
అమ్మ పిలుపు; సంగీతమే అది

షారుఖ్ (మీ ఆవిడకి షారుఖ్ నచ్చితే ...)

నా లుక్కు, షారుక్కు, నీ మెప్పు, లేదు దిక్కు
నీ కులుకు, నీ తళుకు, లేదు నాకు అంత లక్కు
నీ వరకు, నీ మటుకు, సాగే నీ చక్కటి బతుకు
ఈ కోరిక నా కురకు, తిరకాసున పెట్టమాకు.

Friday, April 11, 2008

మా వాడివై (కొడుకుపై తండ్రి కవిత)

ధీరుడవై శూరుడవై, జగమున నిలిచే పౌరడవై
బంధువుడవై, ఆదరుడివై, తండ్రిని మించిన తనయుడవై
అమ్మకు నీడవై, తమ్ముని తోడువై
చిన్నారి చెల్లిని అలరించే మిత్రుడవై
కష్టాలకి శత్రుడవై, సుఖాల సంపన్నుడవై
మేమెచ్చిన కోడలికి, నడిపించే నాధుడవై
మట్టిలో మెరిసిన ముత్యమై, మేమూహించిన సత్యమై
దీన బంధుల నీడవై, మా పున్నమి నాటి వెన్నెలై
మేకోరిన చేరువై, మా తీరిన కోరికై
అండగా నిలిచిన వాడవై, మమ్ముగా ప్రేమించిన మా వాడివై.
నిన్ను చూసి (ప్రేమ కవిత)

నిన్నుచూసి నా రాధవని అనుకున్నా
మురళిలేని వేణు గానమనుకున్నా
ఎదురుగ నిలిచున్నా, నీ మనసుని తాకుతున్నా
నా కళ్ళలోని వేదనని కనలేవా
ప్రతీ క్షణం నాగుండె చప్పుడు వినలేవా
ఈ బంధం ఏనాటిదో సంబంధం కుదిరేనో లేదో

నీ కనులలోని వెలుగునాకు తెలిసింది
నీ పెదవిమీది కొంటె నవ్వు తెలిపింది
ఎదురుగ నిలిచున్నా, నీ మనసుని తాకుతున్నా
ఎన్నాళ్ళని వేచేది
ఆ రోజొస్తుందని చూసేది
కారణాలు లేవని నువ్వంటున్నా
తోరణాలు పేర్చి నే కడుతున్నా
ఒంటరిగా (ప్రేమ కవిత)

ఊహల్లోచేరి నన్నువూరించకే
కళ్ళల్లో కదలాడి మనసు కదిలించకే
ఒంటరిగా ఉన్నాను, జంట కోరుతున్నాను
నాకెదురు పడక నన్ను విసిగించకే

నాతో వస్తావని నేకోరుకున్నాను
నాతోవుంటావని నేనాశపడ్డాను
ఒంటరిగా ఉన్నాను, జంట కోరుతున్నాను
నీ అడుగులో అడుగునై నేసాగుతున్నాను

మన కోసం ఈపాట రాసుకున్నాను
నీతో పాడాలని నేవేచియున్నాను
ఒంటరిగా ఉన్నాను, జంట కోరుతున్నాను
మనయిద్దరి సంగీతం నేపాడుకుంటాను
ఎదురు (ప్రేమ కవిత)

ఎదురు చూశాను నీ రాకకోసం
ఎన్ని ఘడియాలనే నాగుండె నీ శ్వాశకోసం
నీచేతితో తను మాట్లాడాలని
నాచెయ్యి అడిగే నిన్ను పిలువమని
నీవూహలో తను చేరాలని
నా మనసు తలిచే నువు కోరాలని
నీ స్నేహమే నా వూపిరవ్వాలని
నీచెంత నేచేరుకోవాలని
తపియించి నా హృదయం నిను వెతుకుతూవుంది
విరహాన నా తనువు నిను కోరుతూవుంది
బ్రోచేవారేవరురాయనే త్యాగరాజు
కరుణించి ననునీవు చేరదీయ రాదూ!
ఎప్పుడు? (హాస్య ప్రేమ కవిత)

ఉదయం భానుడికై వేచినట్టు
సంధ్యా చంద్రునికోసం చూసినట్టు
కన్నకలలే పండుతూ ఉన్నట్టు
తీయని పండు రాలుతున్నట్టు
పదాలు కుదిరినట్టు, పెదాలు తగిలినట్టు
కరంటు పాకినట్టు, నీ వంటి చీరకట్టు
జిలేబి తిన్నట్టు, జల స్నానం చేసినట్టు
నా తలపే తలపెట్టు, జాచిన నా చెయ్యిపట్టు.
దేవీ గీతం (కవిత)

నినుకోరి నీ బంటునై నిను చేరాలని
నీసేవలో నా జీవితం సాగాలని
కోరింది నేనే, కరుణనేది నీదే
మనిషినైనందుకు కోరికలు కలిగే
దేవతవై యీభక్తుని నుచేర దీయు వరకే
ఊహ (ప్రేమ కవిత)

నువ్వేసే ప్రతి అడుగు, నా మనసునియడుగు
నీ వెంట రావాలని, నీ చెంత చేరాలని
నీ చెయ్యి తగిలింది, చలనం నాలో రగిలింది
నువ్వే కావాలని, నిన్నే కలవాలని
గణ గణ అనే యాశబ్ధం, గుడిలోని గంటకాదు
చేవితోన కాదు నీ మనసు విప్పి విని చూడు
నా శ్వాశలో నీ పేరు, నావూపిరిలో నువుచేరు
నీ తలపే నా గమ్యం, నూ కరుణిస్తే బహురమ్యం
నీ యాలోచన తుంపరై, నా కోరిక కిరణమై
మన కలయిక హరివిల్లు, స్వగ్రుహాన శోభిల్లు
వింత గానం (ప్రేమ కవిత)

గాలికి పడిలేచే నీ కురులనై తాకనా
నీ నవ్వుతో కదలాడే పెదవులనై సాగనా
నీ మెడలోని గోలుసునై, నడుం మీది సొగాసునై
నువు వేసే ప్రతి అడుగులో మువ్వనై మోగనా?
నోటి మాట రానప్పుడు, కవిత ఎలాపొంగెనో
గొంతు విప్పి పాడనపుడు, గానమెలా పలికేనో
మబ్బులేని వానలా, వేసవిన నీడలా
నీ తలపే నా కల మై , యీపదాలు పాడెగా

పొడుగాటి పెళ్ళాం (హాస్య కవిత)

చెట్టుయెక్కి పెట్టు ముద్దు, ఇంటి కప్పు తాను సర్దు
మోకాలి కింది చీరకట్టు, తాను వంగినా నాకన్నా పొడవు, కదూ?
అటక మీది వస్తువైన, తాటి చెట్టు కల్లుయైనా
నింగిలోని తారకైనా, తనతోటి కబురులేనా?
సరిపోని మంచమేనా, చెయ్యి పట్టని కంచమేనా
తల తగిలే ద్వారమేనా, జాణా బెత్తెడు మొగుడు నేనా?

వడియాలు (హాస్య కవిత)

నూనెలో సెగ సెగ, తింటే కర కర
పప్పుతో తినడం మానద్దు
సాంబారులో వాటిని ముంచొద్దు
వట్టివైనా సరే ...
ఆ నూనె నా చొక్కాకి మాత్రం పూయొద్దు.
లావటి పెళ్ళాం (హాస్య కవిత)

కొట్టులోని చీర, బండి మీది మక్కబుట్ట
చారులోని పోపు, తక్కువేలే ఎటు చూడు
నడుంపట్టని నగ, ఉడుంపట్టు దీనిసేగా
తప్పించు కునేదేలా, అంతు తెగని యీవల
ఎన్నో గడ్డం పట్టుకోను, ఎమెడైతే సరిపోను
చెయ్యా, చెయ్యి కాక తొడా? ఈ దెబ్బతో విరిగింది నా మెడ

ఆనందం (ప్రేమ కవిత)

అంతులేని ఆనందం, అద్భుతమైన వసంతం
వేణు లేని మధు గానం, నీ మాటే సంగీతం
అల్లుకునే తీగలా, పొంగుతున్న వాగులా
జారుతున్న పైటలా, నీయాలోచన రమ్యమా

కులుకుతున్న హంసలా, చిలుకుతున్న వెన్నలా
ఎగిరే పతంగులా, నీ కులుకే భంగులా
గాయానికి మందులా, పాదానికి పారాణిలా
వంటి మీది నగలులా, నీ చేతులు తగిలెగా
అంతులేని ఆనందం, అద్భుతమైన వసంతం
వేణు లేని మధు గానం, నీ మాటే సంగీతం

ఎవరివై (ప్రేమ కవిత)

తల్లివై, చెల్లివై, చిన్నారి పిల్లవై
జాజివై, సిరిమల్లెవై, నా తోటలో గులాబివై
చందమై, గంధమై, అద్దం లోని అందమై
విందువై, పసందువై, కావలసిన బంధువై
మండుటెండలో చిరు వానవై, చలి మంటలోని తునకవై
రాచ బాటనడు రాణివై, ఎడబాటు లేని నా దానవై.
నివేదన (ప్రేమ కవిత)

నీ వేదన నా వేదన, నా వేదన నివేదన
నీ వేదన నాదేనా, నీవేనా నా వేదన?
నీవే నా దానవే, నీవే నా నాదమే
నా మదినే వినెదవ, నా మది నీవేననవా?
నువ్వు నేను ( ప్రేమ కవిత)

నువ్వు నాకు కనిపించింది, నిన్ను నువ్వు మరవడానికా
నన్ను నేను చూఢఢానికా, మనయిద్దరం కలవడానికా?
నువ్వు నాకు వినిపించింది, నిన్ను నువ్వు తెలపడానికా
నన్ను నేను మార్చడానికా, మనయిద్దరం పాడడానికా?
నువ్వు నన్ను కదిలించింది, నేను నిన్ను తాకడానికా
నువ్వు నన్ను చుట్టడానికా, మనయిద్దరి ముద్దులాటకా?

Thursday, April 10, 2008

కన్నా (తల్లి పాట)

వెంట నడిచే నా నీడ కన్నా
వీచే చల్లటి చిరు గాలి కన్నా
పూజా పుష్పాల సువాసన కన్నా
నా సన్నిహితుడివిరా చిన్నారి కన్నా